: శ్రాన్ సూపర్ స్పెల్...జింబాబ్వేకు ఝలక్...సరికొత్త రికార్డుకు అవకాశం
తొలి టీ20లో టీమిండియాకు ఝలక్కిచ్చిన జింబాబ్వేకు రెండో టీ20లో భారత్ తరపున అరంగేట్రం చేసిన బరిందర్ శ్రాన్ ఝలక్కిచ్చాడు. టాస్ గెలిచిన జింబాబ్వే బ్యాటింగ్ ప్రారంభించింది. తొలి టీ20లో గెలిచిన ఉత్సాహంతో మసకద్జ (10), చిబాబా (10) బ్యాటింగ్ ఆరంభించారు. అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం చేస్తూ, కొత్త బంతిని తీసుకున్న ధావల్ కులకర్ణి వారిపై ఎలాంటి ప్రభావం చూపలేకపోగా, తొలి టీ20 మ్యాచ్ ఆడుతున్న బరీందర్ శ్రాన్ మాత్రం జింబాబ్వే ఆటకట్టించాడు. 14 పరుగుల వద్ద చిబాబాను పెవిలియన్ కు పంపిన శ్రాన్, 26 పరుగుల వద్ద మసకద్జను అవుట్ చేశాడు. తరువాత 28 పరుగుల వద్ద సికింర్ రాజా (1) ను పెవిలియన్ కి పంపాడు. ఆ తరువాతి బంతికే మొటంబాడ్జి (0)ని అవుట్ చేశాడు. దీంతో మూడు ఓవర్లు బౌలింగ్ చేసిన శ్రాన్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. ఇంకా ఒక ఓవర్ బౌలింగ్ చేసే అవకాశం ఉండగా, ఆ ఓవర్ తొలి బంతికి వికెట్ తీస్తే అరంగేట్ర మ్యాచ్ లోనే హ్యాట్రిక్ తీసిన బౌలర్ గా శ్రాన్ చరిత్రలో నిలిచిపోతాడు.