: 'రాజన్' భయాలను తోసిరాజని లాభాల్లో స్టాక్ మార్కెట్
ఆర్బీఐ గవర్నర్ గా రఘురాం రాజన్ కొనసాగబోవడం లేదని వచ్చిన వార్తలు అనుకున్నంతగా స్టాక్ మార్కెట్ పై ప్రభావం చూపలేదు. ఓ వైపు విదేశీ ఇన్వెస్టర్లు డాలర్లను అమ్ముకుంటున్న తరుణంలో రూపాయి విలువ తీవ్ర ఒత్తిడికి లోనైనప్పటికీ, సెన్సెక్స్, నిఫ్టీలు మాత్రం కొత్త కొనుగోళ్లతో దూసుకెళ్లాయి. ఆరంభంలో క్రితం ముగింపు కంటే 200 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్, అరగంట వ్యవధిలోనే లాభాల్లోకి దూసుకొచ్చింది. ఆపై వెనుదిరిగి చూడకుండా పరుగులు పెట్టింది. సోమవారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 241.01 పాయింట్లు పెరిగి 0.91 శాతం లాభంతో 26,866.92 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ 63.80 పాయింట్లు పెరిగి 0.84 శాతం లాభంతో 8,238.50 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ కాప్ 0.40 శాతం, స్మాల్ కాప్ 0.37 శాతం లాభపడ్డాయి. ఇక ఎన్ఎస్ఈ-50లో 36 కంపెనీలు లాభపడ్డాయి. టాటా మోటార్స్, టాటా స్టీల్, అంబుజా సిమెంట్స్, ఇన్ఫోసిస్ తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, యాక్సిస్ బ్యాంక్, ఏసియన్ పెయింట్స్, సన్ ఫార్మా, ఐచర్ మోటార్స్, ఐటీసీ తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి. బీఎస్ఈలో మొత్తం 2,783 కంపెనీల ఈక్విటీలు ట్రేడింగ్ లో పాల్గొనగా 1,385 కంపెనీలు లాభాలను, 1,193 కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి. గత వారాంతంలో రూ. 1,00,49,157 కోట్లుగా ఉన్న లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 1,01,34,907 కోట్లకు పెరిగింది.