: ముద్రగడ ప్రాణాలతో చంద్రబాబు సర్కార్ చెలగాటమాడుతోంది!: వైసీపీ నేత అంబటి రాంబాబు
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రాణాలతో చంద్రబాబు సర్కార్ చెలగాటమాడుతోందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. హైదరాబాద్ లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తున్నదో చెప్పడానికి నిదర్శనం ముద్రగడ చేసిన వ్యాఖ్యలేనని అన్నారు. ముద్రగడను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ఆయనకు ఏదైనా జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని అంబటి హెచ్చరించారు. తాము సంయమనం పాటిస్తుంటే, చంద్రబాబు సర్కార్ రెచ్చగొడుతోందని ఆరోపించారు. ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు, రాజకీయ నాయకుడు, ప్రముఖ సినీ నటుడు చిరంజీవితో ఇటీవల తాము సమావేశమైన విషయంపై కూడా ఆరోపణలు చేశారని అంబటి మండిపడ్డారు. కులతత్వం కోసమే వారిని కలిశామన్న ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదన్నారు. తన కులానికి ఆపద వచ్చినప్పుడు సాయం చేయలేనివాడు పక్క కులానికి ఏం చేస్తాడని అన్నారు. కాపులకు ఇచ్చిన హామీలు కేవలం ప్రకటనలకే పరిమితమయ్యాయని, ఆ హామీలను నెరవేర్చి ముద్రగడ దీక్ష విరమింపజేయాలని ప్రభుత్వాన్ని అంబటి కోరారు.