: మాజీ ప్రధాని మన్మోహన్ పై రాజస్థాన్ హోం మంత్రి అనుచిత వ్యాఖ్య!... ఆనక సారీ చెప్పిన వైనం!
మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ పై బీజేపీ నేత, రాజస్థాన్ హోం శాఖ మంత్రి గులాబ్ చంద్ కటారియా అనుచిత వ్యాఖ్యలు చేశారు. సదరు వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తడంతో 24 గంటలు తిరక్కముందే ఆయన సారీ చెప్పేశారు. వివరాల్లోకెళితే... రాజస్థాన్ లోని చురాలో నిన్న జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశానికి హాజరైన కటారియా... భారత ప్రధానుల అమెరికా పర్యటనలను ప్రస్తావించారు. గతంలో ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ అమెరికా వెళితే... అక్కడి సాధారణ మంత్రులే స్వాగతం చెప్పారని ఆయన వ్యాఖ్యానించారు. అదే సమయంలో ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా వెళితే... ఆ దేశాధినేత స్వయంగా వచ్చి సాదర స్వాగతం పలుకుతున్నారని మన్మోహన్ ను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై భగ్గుమన్న కాంగ్రెస్ పార్టీ కటారియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని కించపరిచేలా మాట్లాడిన కటారియా వ్యాఖ్యలపై సీఎం వసుంధర రాజే వివరణ ఇవ్వాలని, కటారియాను మంత్రివర్గం నుంచి డిస్మిస్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. దీంతో ఈ వివాదం మరింత పెద్దది కాకముందే కటారియా నేటి ఉదయం జైపూర్ లో సారీ చెప్పారు. మన్మోహన్ ను కించపరిచేలా తాను వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదని ఆయన తన తప్పును ఒప్పుకున్నారు.