: మరోసారి తెరపైకి రామమందిరం.. దానిని కూల్చింది ఔరంగజేబు.. బాబర్ కాదట!
ఎన్నో ఏళ్లుగా ప్రజల నోళ్లలో నానుతున్న రామమందిర అంశం మరోమారు తెరపైకి వచ్చింది. వచ్చే ఏడాది యూపీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ అంశం ఆసక్తికరంగా మారింది. ఇక ఇప్పటి వరకు భావిస్తున్నట్టు రామమందిరాన్ని బాబర్ కూల్చలేదని, ఔరంగజేబు హయాంలో దానిని కూల్చివేశారని తాజాగా మాజీ ఐపీఎస్ అధికారి కిషోర్ కునాల్ పేర్కొన్నారు. ‘అయోధ్య రీవిజిటెడ్’ పేరుతో ఆయన రాసిన పుస్తకంలో పలు విషయాలను ప్రస్తావించారు. బీహార్ కు చెందిన కునాల్ 1972 గుజరాత్ కేడర్ అధికారి. ఈ పుస్తకం కోసం ఆయన చాలా కష్టపడ్డారు. చరిత్రను తిరగేశారు. పురావస్తు శాఖనుంచి వివరాలు సేకరించారు. ఆ పుస్తకం ప్రకారం.. అయోధ్యలో మసీదు నిర్మాణానికి ముందు అక్కడ రామ జన్మభూమి ఆలయం ఉండేది. అందరూ అనుకుంటున్నట్టు దీనిని 1528లో బాబర్ హయాంలో కూల్చివేయలేదు. 1660లో ఔరంగజేబు హయాంలో కూల్చివేశారు. అప్పట్లో ఫెదాయ్ ఖాన్ అక్కడ గవర్నర్ గా ఉండేవారు. ‘‘అయోధ్యలోని రామమందిరాన్ని కూల్చివేయమని బాబర్ ఎప్పుడూ ఆదేశించలేదు. నిజానికి ఆయనెప్పుడూ అయోధ్యను సందర్శించలేదు’’ అని పుస్తకంలో పేర్కొన్నారు. మొఘల్ రాజులలో బాబర్ నుంచి షాజహాన్ వరకు అందరూ ఇతర మతాలను కూడా ఆదరించారని రాశారు. ‘‘బాబర్ నుంచి షాజహాన్ వరకు అందరు చక్రవర్తులు అన్ని మతాలపైనా ఉదారంగా ఉండేవారు. ఆ సమయంలో అయోధ్యలోని సాధుసంతులు ఎంతో ఆనందంగా జీవించేవారు. అవధ్ ప్రాంతంలోని నలుగురు నవాబుల హయాంలో మతసామరస్యం వెల్లివిరిసింది. అయితే ఔరంగజేబు వచ్చిన తర్వాత పరిస్థితులు మొత్తం మారిపోయాయి’’ అని వివరించారు.