: ఈ అంధుడి ధైర్యం ముందు దొంగల ఆటలు సాగలేదు!
ఆయన పేరు షకీర్ హుస్సేన్(26). ఢిల్లీ యూనివర్సిటీ(డీయూ)లో ఎంఫిల్ స్కాలర్. 80 శాతం అంధత్వంతో బాధపడుతున్నహుస్సేన్ తనలో ధైర్యానికి ఏమాత్రం కొదవలేదని చాటిచెప్పాడు. శుక్రవారం రాత్రి డిన్నర్ అనంతరం దగ్గర్లో ఉన్న ఏటీఎంకు వెళ్లేందుకు క్యాంపస్ నుంచి బయలుదేరాడు. ఫోన్లో స్నేహితుడితో మాట్లాడుతూ వెళ్తున్న హుస్సేన్ ను వెనకనుంచి బైక్ పై వచ్చిన ముగ్గురు దుండగులు అతడి ఫోన్ ను లాక్కునేందుకు ప్రయత్నించారు. క్షణాల్లోనే తేరుకున్న హుస్సేన్ బైక్ పై వెనక కూర్చున్న వ్యక్తి కాలర్ పట్టుకోవడంతో బైక్ అదుపుతప్పి కిందపడింది. ఆ వెంటనే ఓ వ్యక్తిని హుస్సేన్ గట్టిగా పట్టుకున్నాడు. దీంతో అతడి బారి నుంచి తప్పించుకునేందుకు మిగతా ఇద్దరూ బాధితుడిపై పిడిగుద్దులు కురిపించారు. తీవ్ర గాయాలై ముక్కునుంచి రక్తం కారుతున్నా హుస్సేన్ మాత్రం ఆ వ్యక్తిని విడిచిపెట్టలేదు. ఈ లోపు చుట్టుపక్కల వారు గమనించడంతో మిగతా ఇద్దరూ పారిపోయారు. ఇక చిక్కిన దొంగమాత్రం మరో నాటకానికి తెరతీశాడు. హుస్సేన్ తనను దోచుకుంటున్నాడని, అతనో దొంగని చెప్పాడు. అయితే హుస్సేన్ డీయూ విద్యార్థి అని అక్కడ చాలామందికి తెలియడంతో అతని ఆటలు సాగలేదు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. దుండగులను విజయ్(22), మనోజ్(21), రవి(23)గా గుర్తించారు. హుస్సేన్ ధైర్యానికి ముగ్ధులైన పోలీసులు అతనికి బ్రేవరీ అవార్డు ఇచ్చి సత్కరించాలని భావిస్తున్నారు.