: ఆయనకు 472 మంది కూతుళ్లు ఫాదర్స్ డే శుభాకాంక్షలు చెప్పారు
ఫాదర్స్ డే నాడు 472 మంది కూతుళ్లు ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. ఆయనకు అంతమంది కూతుళ్లు ఉండటం ఎలా సాధ్యమనే అనుమానం తలెత్తకమానదు!. వాళ్లందరూ ఆయన సొంత బిడ్డలు కాదు. భర్త చనిపోయిన స్త్రీలు, అదీ ఆర్థికంగా అంత స్తోమత లేని వారు తమ కూతుర్లకు పెళ్లి చేయడం చాలా కష్టమని, అందుకే తాను ఈ బాధ్యతను తీసుకున్నానని గుజరాత్ కు చెందిన మహేష్ సవాని పేర్కొన్నారు. ఇప్పటివరకు 472 మంది యువతులకు తాను వివాహాలు చేయించానని చెప్పారు. ఈ ఆలోచన వెనుక కథను కూడా ఆయన ఈ సందర్భంగా వివరించారు. పదేళ్ల క్రితం తన తమ్ముడు చనిపోవడంతో అతడి కూతుళ్లకు వివాహాలు చేశాడు. అప్పటి నుంచి తండ్రి లేని 472 మంది యువతులకు వివాహాలు చేయించానని చెప్పుకొచ్చారు. ఒక్కొక్క వివాహానికి సుమారు రూ.4 లక్షలు చొప్పున ఖర్చు చేశానని, తాను వివాహం జరిపించిన వారిలో అన్ని కులాలు, మతాలకు చెందిన వారున్నారని మహేష్ సవాని చెప్పారు.