: పని మాది.. క్రెడిట్ మీదా?.. మోదీ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసిన దీదీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోమారు బీజేపీ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. కోల్‌కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆమె.. తమ ప్రభుత్వ గొప్పతనాన్ని బీజేపీ తన గొప్పగా చెప్పుకుంటోందని ఆరోపించారు. ఇందుకు దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుంటోందని అన్నారు. కన్యాశ్రీ పథకం కింద బెంగాల్ వ్యాప్తంగా మహిళలు బ్యాంకు అకౌంటు తీసుకున్నారని, అయితే అది తమ ఘనతే అని కేంద్రం చెప్పుకుంటోందని విమర్శించారు. ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో మాత్రమే వారా ఘనతను సొంతం చేసుకోగలరని, కానీ తాము పనిచేసి ప్రజల క్రెడిట్ తీసుకుంటామని అన్నారు. ‘మేం టాయిలెట్లు నిర్మిస్తుంటే వారు స్వచ్ఛభారత్ అంటూ ఊదరగొడుతున్నారు’’ అని మమత మండిపడ్డారు. సింగూరు భూములను వెనక్కి ఇవ్వడంపై ఓ కార్యకర్త అడిగిన ప్రశ్నకు సమాధానంగా మాట్లాడుతూ ఆ విషయం కోర్టులో ఉందని, త్వరలోనే ఫలితం చూస్తారని పేర్కొన్నారు. ఆందోళన వద్దని, త్వరలోనే తీర్పు వస్తుందని, రైతులకు తిరిగి వారి భూములు అందుతాయని భరోసా ఇచ్చారు.