: హరీశ్ రావు మంచోడనుకున్నా... కాదని తేలింది: వీహెచ్
తెలంగాణ మంత్రి హరీశ్ రావు ప్రజలను రెచ్చగొట్టి రైతులను మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు విమర్శించారు. ఆయన మంచివాడని తాను భావించానని, కానీ ఆయన కుట్ర పూరిత వ్యాఖ్యలతో తాను మంచివాడిని కాదని నిరూపించుకున్నారని అన్నారు. నల్గొండ జిల్లా దేవరకొండలో మీడియాతో మాట్లాడిన ఆయన, ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలను ఆయన కావాలనే రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. తాను 400 గ్రామాల ప్రజలను రెచ్చగొడతానని అనడం, మంత్రిగా ఆయన స్థాయికి తగ్గ వ్యాఖ్యలు కాదని హితవు పలికారు. కాంట్రాక్టులు, మంత్రి పదవులను ఆశగా చూపుతూ, విపక్ష ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియాగాంధీయేనని కేసీఆర్ తెలుసుకోవాలని హితవు పలికారు. సీపీఐ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ పార్టీ మారడంపై నిప్పులు చెరిగిన వీహెచ్, వామపక్షాల ఐడియాలజీ ఎక్కడ మట్టిలో కుక్కి కేసీఆర్ పంచన చేరారని ప్రశ్నించారు.