: ఇక ఢిల్లీ పోలీసుల వంతు.. యాపిల్ ఐఫోన్ అన్‌లాకింగ్‌పై దృష్టి!
అమెరికాలో మారణహోమం సృష్టించి 14 మంది మృతికి కారణమైన ఉగ్రవాదులు ఫరూక్, ఆయన భార్య తష్పీన్ మాలిక్ ఉపయోగించిన యాపిల్ ఐఫోన్ గురించి గుర్తుందా? దానిని అన్‌లాక్ చేసి అందులోని సమాచారం గుట్టు విప్పేందుకు అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎప్బీఐ) పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. తాజాగా ఢిల్లీ పోలీసులు కూడా ఆపిల్ ఐఫోన్, ఇతర మొబైళ్ల అన్‌లాకింగ్‌పై దృష్టి సారించారు. ఇందుకోసం కావాల్సిన సాఫ్ట్వేర్ కోసం విదేశీ సంస్థలను సంప్రదించినట్టు తెలిసింది. తద్వారా ఐఫోన్లలో నిక్షిప్తమైన డాటా, ఐక్లౌడ్ బ్యాకప్ డాటాను డీకోడ్ చేయాలని భావిస్తున్నారు. ఫోన్లలో కాంటాక్ట్ లిస్టు, మెసేజ్‌లు, జియో డాటా, డిలీట్ చేసిన సామాజిక మాధ్యమాల పోస్టులు, మెసెంజెర్ టెక్స్ట్‌తో పాటు అప్లికేషన్ పాస్‌వర్డ్‌లను తెలుసుకోవడం ద్వారా అందులోని సమాచారాన్ని సులభంగా గుర్తించే వీలుంటుంది. అలాగే ఫోర్స్క్వేర్, వీకే, కిక్ , లైన్, వైబర్, టెక్సీ తదితర ఫ్లాట్‌ఫామ్‌ను కూడా యాక్సిస్ చేసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. సాఫ్ట్వేర్ చేతికందిన వెంటనే వారి వద్ద ఉన్న 8400 ఫోన్లను అన్‌లాక్ చేసి డాటాను వెలికితీయనున్నారు. ఇందులో బ్లాక్‌బెర్రీ ఫోన్లతోపాటు చైనా తయారీ ఫోన్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ వివిధ నేరాల సందర్భంగా పట్టుబడినవే కావడం గమనార్హం. ఫోన్లలో నేరస్తులు నిక్షిప్తం చేసిన సమాచారాన్ని తెలుసుకోవడం ద్వారా మరిన్ని నేరాలు జరగకుండా అరికట్టవచ్చని ఢిల్లీ పోలీసులు భావిస్తున్నారు.