: నిమ్మలకా, జేసీకా... కేంద్ర మంత్రి పదవి ఎవరికి దక్కేనో!


16 మంది పార్లమెంట్ సభ్యులతో ఎన్డీయే ప్రభుత్వానికి కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీకి మరో కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తుండటంతో, ఆ చాన్స్ ఎవరికి లభిస్తుందన్న విషయమై ఎవరికి వారే తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తరఫున సుజనా చౌదరి, అశోక్ గజపతి రాజులు కేంద్ర మంత్రులుగా ఉన్న సంగతి తెలిసిందే. మరో పదవిని ఆఫర్ చేసిన అమిత్ షా, అందుకు ఇద్దరు ఎంపీల పేర్లను సూచించాలని పేర్కొనగా, నిమ్మల కిష్టప్ప, జేసీ దివాకర్ రెడ్డిల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇక శాఖల మార్పులో భాగంగా వెంకయ్యనాయుడిని గ్రామీణాభివృద్ధి శాఖకు మార్చిన పక్షంలో, పట్టణాభివృద్ధి శాఖ తెలుగుదేశం ఖాతాలోకి వస్తుందని తెలుస్తోంది. ఇప్పుడున్న మంత్రులు కోస్తాకు చెందినవారు కావడంతో, ఈసారి చాన్స్ రాయలసీమకు దక్కుతుందని పార్టీ సీనియర్లు భావిస్తున్నారు. మరోవైపు తెలంగాణ టీడీపీ నేతలు సైతం ఈ పదవిపై ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. బీజేపీ స్వయంగా పిలిచి పదవిని ఇస్తే తప్ప, తమంత తాముగా అడగరాదని సీఎం చంద్రబాబు భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. దీంతో తదుపరి మోదీ మంత్రివర్గ విస్తరణలో ఎవరికి చాన్స్ దక్కుతుందన్న విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News