: ఆక్వా రంగం వల్ల 16 వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యం లభిస్తోంది: ప్రత్తిపాటి పుల్లారావు
ఆక్వా రంగం వల్ల 16 వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం లభిస్తోందని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. నెల్లూరు జిల్లా దగదర్తిలో బీఎంఆర్ హేచరీస్ ను ప్రారంభించిన సందర్భంగా మంత్రులు దేవినేని ఉమ, నారాయణ, సిద్ధా రాఘవరావుతో కలిసి పర్యటించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆక్వా రంగాన్ని వ్యవసాయ రంగంగా గుర్తించాలని సీఎం చంద్రబాబు సూచించారని అన్నారు. మత్స్యకారులు, రైతులకు కూడా చంద్రన్న బీమా పథకాన్ని వర్తింప చేస్తామని ఆయన చెప్పారు. ఆక్వా రంగానికి చెందిన ప్రైవేటు విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఆమోదం తెలపడం జరిగిందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో చేపల మార్కెట్లను ఆధునికీకరణ చేస్తామని ఆయన అన్నారు. సముద్ర ముఖద్వారం పనులు సత్వరమే పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. వచ్చే ఏడాది 27 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన చెప్పారు.