: దేవుడు వరమిచ్చినా?... నోటిఫికేషన్ల కోసం ఏపీ నిరుద్యోగులకు రెండు నెలల ఎదురుచూపు తప్పదు!


నిజమే... దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించలేదన్న సామెత ఏపీ నిరుద్యోగులకు ఇట్టే సరిపోతోంది. నవ్యాంధ్రప్రదేశ్ లో ఒకేసారి 10 వేల పై చిలుకు సర్కారీ ఉద్యోగాల భర్తీకి నారా చంద్రబాబునాయుడు సర్కారు పచ్చజెండా ఊపింది. ఈ మేరకు సదరు పోస్టుల భర్తీకి నిన్న ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ ఆమోద ముద్ర వేసింది. వెనువెంటనే భర్తీ ప్రక్రియను కూడా మొదలుపెట్టాలని ఏపీపీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లన్నీ జారీ అయ్యేందుకు ఎంత లేదన్నా రెండు నెలల సమయం పడుతుందని ఎపీపీఎస్సీ చైర్మన్ ఉదయ భాస్కర్ కొద్దిసేపటి క్రితం చావు కబురు చల్లగా చెప్పారు. ఇప్పటికే ఏళ్ల తరబడి సర్కారీ ఉద్యోగాల నియామకం నోటిఫికేషన్ల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇది ఒక షాక్ అనే చెప్పచ్చు. అయితే వాస్తవ పరిస్థితులు వివరిస్తూ ఉదయ భాస్కర్ చేసిన వాదనలోనూ నిజముందని చెప్పక తప్పదు. రాష్ట్ర విభజన తర్వాత అప్పటిదాకా ఉన్న ఉమ్మడి రాష్ట్ర సర్వీస్ కమిషన్ రెండుగా చీలిపోయింది. ఈ క్రమంలో సింగిల్ సభ్యుడు మాత్రమే ప్రస్తుతం ఏపీపీఎస్సీలో ఉన్నారు. ఇక ఇటీవలే ఉదయ భాస్కర్ ను ఏపీపీఎస్సీ చైర్మన్ గా ప్రభుత్వం నియమించింది. అయితే మొత్తం 9 మంది సభ్యులుండాల్సిన కమిషన్ లో ఒక్క సభ్యుడితో వేగంగా చర్యలు చేపట్టడం సాధ్యం కాదని ఉదయ భాస్కర్ చెప్పారు. కనీసం మరో ఇద్దరు, ముగ్గురు సభ్యులు అందుబాటులోకి వస్తే తప్పించి ఉద్యోగ నియామకాల్లో వేగాన్ని పెంచలేమని ఆయన చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News