: ఇక రాజకీయ సన్యాసం!... ఇక పరోక్ష ఎన్నికల్లోనూ పోటీ చేయను!: వెంకయ్య సంచలన ప్రకటన
తెలుగు నేలలో పుట్టి జాతీయ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న బీజేపీ సీనియర్ నేత, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు మరో ఆరేళ్లలో అస్త్ర సన్యాసం చేయనున్నారు. ఇప్పటికే సుదీర్ఘ రాజకీయ జీవితంలో వెంకయ్య చాలా కీలక పదవులను అలంకరించారు. బీజేపీలో ఏ ఒక్కరికి సాధ్యం కాని రీతిలో ఆయన నాలుగు పర్యాయాలు రాజ్యసభకు ఎన్నికై ఇటీవలే రికార్డు సృష్టించారు. ఈ నేపథ్యంలో నిన్న హైదరాబాదు వచ్చిన ఆయనను బీజేపీ తెలంగాణ శాఖ ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా మాట్లాడిన వెంకయ్య తన రాజకీయ సన్యాసంపై నోరు విప్పారు. జాతీయ నాయకుడిగా ఉంటూ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయరాదన్న ఉద్దేశంతోనే తాను పరోక్ష ఎన్నికల్లో పాల్గొంటున్నానని చెప్పిన వెంకయ్య ఇకపై పరోక్ష ఎన్నికల్లోనూ పాల్గొనేది లేదని తేల్చిచెప్పారు. ‘‘ప్రత్యక్ష ఎన్నికలే కాదు... పరోక్ష ఎన్నికల్లో కూడా మరోసారి పోటీ చేయను. ఇవే నాకు చివరి ఎన్నికలు. రాజ్యసభ సభ్యుడిగా 18 ఏళ్లు పనిచేసిన నేను... రాజకీయాల నుంచి వైదొలగిన తర్వాత సేవా కార్యక్రమాల్లో భాగస్వామిని కావాలనుకుంటున్నాను. తోడుగా ఉండి సహకరించాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరడంతో రాజస్థాన్ నుంచి మళ్లీ రాజ్యసభకు పోటీ చేశా. ఈ దఫా గడువు ముగిసిన తర్వాత మళ్లీ పోటీ చేసే అవకాశం లేదు’’ అని వెంకయ్య వ్యాఖ్యానించారు.