: బడి వేళలు మార్చాలంటూ డిమాండ్ చేసిన తల్లిదండ్రులను నిర్బంధించిన సికింద్రాబాద్ స్కూల్ యాజమాన్యం
బడి వేళలు మార్చాలంటూ డిమాండ్ చేసిన తల్లిదండ్రులను స్కూలు యాజమాన్యం నిర్బంధించిన ఘటన సికింద్రాబాదులో చోటుచేసుకుంది. సెయింట్ ఆండ్రూస్ స్కూలు పనివేళలు అసంబద్ధంగా ఉన్నాయని, వాటిని మార్చాలని ఆ స్కూల్ లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు. దీంతో స్కూలు ఆవరణ నుంచి బయటకు వెళ్లే గేట్లు మూసేసి స్కూలు యాజమాన్యం తల్లిదండ్రులను నిర్బంధించింది. ఈ విషయం తెలుసుకున్న ఇతర విద్యార్ధుల తల్లిదండ్రులు గేటు వద్దకు చేరుకుని ఆందోళన నిర్వహించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. అనంతరం పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను శాంతింపజేశారు.