: మీడియా ముందుకి కేటుగాడు శివానంద బాబా... దొంగస్వామి లీలలు వివరించిన పోలీసులు!
కేటుగాడు శివానందబాబాను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. హైదరాబాదులోని లైఫ్ స్టైల్ బిల్డింగ్ యజమాని, రియల్టర్ మధుసూదన్ రెడ్డి కుటుంబాన్ని ఆసుపత్రి పాలు చేసి కోటీ 30 లక్షల రూపాయలు కాజేసిన వైనాన్ని పోలీసులు వెల్లడించారు. బెంగళూరులో ఉండే శివ, మోహన్ రెడ్డి అనే వ్యక్తి ద్వారా మధుసూదన్ రెడ్డికి పరిచయమయ్యాడు. లక్ష్మీ పూజలు చేస్తానని చెప్పుకుని తిరిగే శివ ఆయనతో మంచి సంబంధాలు నడిపాడు. చాలా కాలంగా పరిచయం ఉండడంతో బెంగళూరులో ఓ సారి కలిశారు. ఆ సందర్భంగా 2.5 లక్షల రూపాయలను 5 లక్షలు (రెట్టింపు) చేసినట్టుగా మ్యాజిక్ చేసి, బురిడీ బాబా (శివానందబాబా) మధుసూదన్ రెడ్డిని బుట్టలో వేశాడు. దీనిని నమ్మేసిన మధుసూదన్ రెడ్డి తాను కూడా పూజలు చేయించాలన్న ఉద్దేశంతో, బెంగళూరు నుంచి శివానందబాబాను ఒక క్యాబ్ లో తీసుకొచ్చి, బంజారాహిల్స్ లోని ఓ హోటల్ లో ఉంచారు. ఈ సమయంలో మధుసూదన్ రెడ్డికి తెలియకుండా దామోదర్, శ్రీనివాసరెడ్డి అనే ఇద్దరు వ్యక్తులను కూడా శివ తన వెంట తీసుకుని వచ్చాడు. వారికి రెట్టింపు ఇస్తానని చెప్పి వారి నుంచి మూడు లక్షలు తీసుకున్నాడు. వారిని ఫలానా చోట ఉండమని చెప్పాడు. ఆ తర్వాత, పూజలు చేయడానికి వివిధ సామాన్లు కావాలని సూచించడంతో మధుసూదన్ రెడ్డి కోఠిలోని ఎంజీ రోడ్డులో పూజసామగ్రి కొనుగోలు చేశారు. అనంతరం మధుసూదన్ రెడ్డి నివాసంలో పూజలు చేయగా, ఆ పూజలో లక్షా 50 వేల రూపాయలు పెట్టారు. అనంతరం వారిని మాయలో ముంచిన శివ చాకచక్యంగా వాటిని 3 లక్షల రూపాయలు చేసినట్టు చూపించాడు. దీంతో అతనిపై వారికి భరోసా ఏర్పడింది. ఇంట్లో ఇంకా డబ్బులంటే పూజలో పెట్టాలని, దానిని డబుల్ చేస్తానని చెప్పడంతో ఇంట్లో ఉన్న కోటీ 30 లక్షల రూపాయలు తెచ్చి పూజలో పెట్టారు. అనంతరం పూజలు చేశాడు. తరువాత ఉమ్మెత్త ఆకులు, సీసం కలిపి తయారు చేసిన ప్రసాదం వారిచేత తినిపించాడు. ఆ తతంగం పూర్తయిన తరువాత డబ్బును చూడగా అది డబుల్ కాలేదు. దీంతో పూజలో ఏదో తప్పు జరిగింది... దగ్గర్లోని గుడిలో ఈ పూజలు చేద్దామని చెప్పడంతో ఆ డబ్బు తీసుకుని మధుసూదన్ రెడ్డి కుమారుడు సందేశ్ రెడ్డితో కలిసి శివానందబాబా ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉన్న గుడికి వెళ్లాడు. అక్కడ పూజలు పూర్తి చేసిన బాబా, చేతులు కడుక్కోవాలంటూ తనకు బస ఏర్పాటు చేసిన హోటల్ రూంకి సందేశ్ రెడ్డిని తీసుకెళ్లాడు. అప్పటికే ఉమ్మెత్త ఆకులు, సీసం కలిసిన ప్రసాదం తినడంతో కుటుంబ సభ్యులు నెమ్మదిగా మగతలోకి జారుకోవడం ప్రారంభించారు. ఇంతలో 'రూంలో కాసేపు ధ్యానం చేద్దాం, నీ దగ్గర మెటల్ వస్తువులు ఏవైనా ఉంటే దానిని శరీరానికి దూరంగా ఉంచు' అంటూ సందేశ్ రెడ్డికి సూచించాడు. దీంతో సందేశ్ రెడ్డి జేబులోని కార్ కీస్ తీసి బయటపెట్టాడు. ఇక్కడే తెలివితేటలు ప్రదర్శించిన శివ, అతనిని ధ్యానం చేయమని చెప్పి, ఆ కారు కీస్ తీసుకుని తను బయటకు వచ్చి అతని కారులోని డబ్బును, వారే అరేంజ్ చేసిన క్యాబ్ లోకి మార్చాడు. తర్వాత ఏమీ ఎరగనట్టు పైకి వచ్చి, కార్ కీస్ అక్కడే పెట్టేశాడు. అప్పటికే సందేశ్ రెడ్డికి కూడా మగతగా ఉండడంతో కారులో డబ్బు చూసుకోకుండా ఇంటికి వెళ్లిపోయాడు. తను వచ్చేసరికి ఇంట్లో తల్లిదండ్రులు అపస్మారక స్థితిలో ఉండడంతో వారిని ఆసుపత్రిలో చేర్చాడు. ఇదిలా వుండగా, తనకు మూడు లక్షలిచ్చిన దామోదర్, శ్రీనివాసరెడ్డిని జీవీకే మాల్ దగ్గరకు రమ్మని పిలిచాడు. వారు రావడంతో వారికి 12 లక్షల రూపాయలు ఇచ్చాడు. ఆ తర్వాత 'రాత్రి 8 గంటలకు మళ్లీ వస్తాను, ఇక్కడే వుండు' అని చెప్పి తన క్యాబ్ డ్రైవర్ కు చెప్పి, అతని మైండ్ డైవర్ట్ చేసి ఆటో ఎక్కేశాడు. అక్కడి నుంచి ఆడంబార్ చౌరస్తాకి వెళ్లి బెంగళూరు బస్సెక్కి వెళ్లిపోయాడు. ఈ శివ చిత్తూరు జిల్లాలోని కుప్పంలోని వండుగంపల్లి గ్రామానికి చెందినవాడు. ఇంటర్మీడియట్ మధ్యలో చదువు మానేసి చీటింగ్ ల బాటపట్టాడు. అంతకు ముందు కొంత కాలం బెంగళూరులోని వివిధ ఆశ్రమాల్లో గడిపాడు. అక్కడ ఈ చీటింగ్ వివరాలు నేర్చుకుని హైదరాబాదు, చిత్తూరుల్లో పలువురిని మోసం చేసినట్టు పోలీసులు తెలిపారు. కూకట్ పల్లిలో డబ్బులు డబుల్ చేస్తానని చెప్పి కొందరిని 25 లక్షలకు మోసం చేశాడు. బెంగళూరులో రెండు సార్లు ఇలాంటి చీటింగ్ చేశాడు. చిత్తూరులోని నల్లమోహన్ రెడ్డి నుంచి 70 లక్షలు, కడప రాజంపేటలో కొందరిని ఇలాగే మోసం చేశాడని పోలీసులు తెలిపారు.