: పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాను: షీలా దీక్షిత్


కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత అప్పగించినా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత షీలా దీక్షిత్ తెలిపారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆమెను నిలబెట్టనున్నారని, పంజాబ్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఆమెకు అప్పగించనున్నారంటూ వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. వీటిపై స్పందించిన ఆమె, పార్టీ ఎలా చెబితే అలా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. కాగా, పంజాబ్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కమల్ నాథ్ రాజీనామాను ఆమోదించడం మంచి నిర్ణయమేనని ఆమె అభిప్రాయపడ్డారు. ఆయనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవని ఆమె చెప్పారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వివాదాలకు పార్టీ దూరంగా ఉంటుందని ఆమె తెలిపారు. పంజాబ్ లోని కపుర్తలాకు చెందిన ఆమె, పంజాబ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి అమరీందర్ సింగ్ కు స్నేహితురాలు కావడం విశేషం. పంజాబీ ఖత్రి కమ్యూనిటీకి చెందిన షీలా దీక్షిత్... కేంద్ర మాజీ మంత్రి, యూపీకి చెందిన ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు ఉమాశంకర్ దీక్షిత్ కు కోడలు. ఉమాశంకర్ దీక్షిత్ తనయుడు, ఐఏఎస్ అధికారి దివంగత వినోద్ దీక్షిత్ ను ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News