: యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు సాధన చేస్తోన్న ఇస్లామిక్ పాఠశాల విద్యార్థినులు
ఇస్లాం మతాన్ని అనుసరించేవాళ్లు యోగా జోలికి పోవద్దంటూ కొన్ని రోజుల ముందు పత్వాలు జారీ అయిన సంగతి తెలిసిందే. అయితే యోగాకి మతంతో సంబంధంలేదనే సందేశాన్ని పాటిస్తూ గుజరాత్‌లోని ఓ ఇస్లామిక్ పాఠశాలలో విద్యార్థినులు ఈనెల 21వ తేదీన నిర్వహించనున్న రెండవ ‘ప్రపంచ యోగా దినోత్సవం’లో పాల్గొనడానికి సాధన చేస్తున్నారు. యోగాకు పుట్టినిల్లయిన భారత్‌లో ఈనెల 21న యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని, అందరినీ యోగా దినోత్సవంలో పాల్గొనేలా చెయ్యాలని ప్రభుత్వం భావిస్తోన్న సంగతి తెలిసిందే. ముస్లింలు మాత్రం యోగా నేర్చుకోకూడదని పలువురు మతగురువులు పత్వా జారీ చేశారు. కానీ, పత్వా ఆదేశాలను పక్కన బెట్టి ఇస్లామిక్ పాఠశాల యాజమాన్యం యోగా గురువును నియమించి మరీ తమ విద్యార్థినులకు యోగా నేర్పిస్తోంది. యోగా వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని విద్యార్థులు మీడియాతో అన్నారు. యోగా సాధన వల్ల ఉపవాసం సమయంలో నీరసించకుండా ఉంటామని అన్నారు. యోగా వల్ల నిత్యం ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండొచ్చని పేర్కొన్నారు. యోగాలో ఓం కారం ఉచ్చారణ ఇష్టం లేకపోతే విద్యార్థినులు పలకక్కర్లేదని, ఇష్టం ఉంటే పలకచ్చని చెప్పినట్లు స్కూల్ యాజమాన్యం చెప్పింది. తమ విద్యార్థులు గత ఏడాది జరిగిన మొదటి ‘ప్రపంచ యోగా దినోత్సవం’లోనూ పాల్గొన్నారని ఇస్లామిక్ పాఠశాల యాజమాన్యం గర్వంగా చెప్పింది.