: ముద్రగడను చూడనివ్వకుండా ఆంక్షలు పెడుతున్నారు: బొత్స ఆగ్రహం
తుని ఘటనలో అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తోన్న కాపునేత ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితిపైన, ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరుపైన వైఎస్సార్ సీపీ నేత బొత్స సత్యనారాయణ మరోసారి స్పందించారు. హైదరాబాద్‌లోని వైసీపీ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సమస్యను జటిలం చేయకుండా చూడాలని ప్రభుత్వానికి సూచించారు. ముద్రగడ దీక్షపై మంత్రులు పలు వ్యాఖ్యలు చేస్తున్నారని, బాధ్యతలు లేని మాటలు మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఏం చేద్దామనుకుంటున్నారని బొత్స దుయ్యబట్టారు. ముద్రగడను చూసి రావడానికి వీలు లేకుండా అంక్షలు పెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రభుత్వం గొప్పలకు పోవద్దు, ఒంటెద్దు పోకడలు పోవద్దు, సమస్యను పరిష్కరించే దిశగా ప్రభుత్వం వ్యవహరించాలి’ అని ఆయన వ్యాఖ్యానించారు.