: బీజేపీ మంత్రి అలక... దేశం నేతకు చంద్రబాబు వార్నింగ్!
పశ్చిమ గోదావరి జిల్లాలో బీజేపీ నేత, మంత్రి మాణిక్యాల రావు, దేశం నేత జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు మధ్య నెలకొన్న విభేదాలు ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు వెళ్లగా, బాపిరాజుకే వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. జిల్లాలో మంత్రిగా ఉన్నప్పటికీ, తనకు తెలియకుండా పలు అభివృద్ధి పనులను తెలుగుదేశం నేతలు చేపడుతున్నారని, ఇది ప్రొటోకాల్ ఉల్లంఘనేనని మాణిక్యాలరావు గుర్రుగా ఉన్నారట. దేశం నేతల వైఖరిపై అలిగిన ఆయన, ఇదే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకు వెళ్లి తన అసంతృప్తిని వెళ్లగక్కగా, బాపిరాజును పిలిపించిన చంద్రబాబు ఆయనను మెత్తగా మందలించినట్టు తెలుస్తోంది. టీడీపీ, బీజేపీ సంబంధాలపై ప్రభావం చూపే ఎలాంటి పనులూ వద్దని, అనవసర సమస్యలు కొని తేవద్దని బాబు హెచ్చరించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, ఓటుకు నోటు కేసులో ఏనాటికైనా చంద్రబాబు తప్పు అంగీకరించాల్సిందేనని మాణిక్యాలరావు వ్యాఖ్యానించారని బాపిరాజు ఫిర్యాదు చేసినప్పటికీ, బాబు పెద్దగా పట్టించుకోలేదని సమాచారం.