: 'వాట్స్ యాప్'లో సోనియా గాంధీ అభ్యంతరకర ఫోటో... రెండు వర్గాల మధ్య ఘర్షణ.. ఒకరి మృతి!


మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ లో ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీపై వాట్స్ యాప్ లో పెట్టిన ఓ ఫోటో, మెసేజ్ ఒకరి ప్రాణం తీయగా, ఆరుగుర్ని గాయపరిచింది. జబల్పూర్ సిటీ ఏరియా ఎస్పీ ఇంద్రజీత్ బల్సావర్ చెప్పిన వివరాల ప్రకారం... విజయనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాంగ్రెస్ కార్పొరేటర్ జతిన్ రాజ్ 'విజయ నగర్ ఫ్రెండ్స్' పేరిట వాట్స్ యాప్ గ్రూప్ క్రియేట్ చేశాడు. ఈ గ్రూపులో అదే ప్రాంతానికి చెందిన ప్రశాంత్ నాయక్ అనే వ్యక్తి సోనియా గాంధీ పాత్రలు తోముతున్నట్లున్న ఓ అభ్యంతరకర వ్యంగ్య చిత్రాన్ని పోస్టు చేసి, 'సోనియా ఈ దుస్థితికి రావడానికి మోదీ కారణం' అన్నట్టు అర్థం వచ్చే వ్యాఖ్యను జత చేశాడు. దీంతో జతిన్ రాజ్ కు కోపం వచ్చింది. దీనిపై గత రాత్రి అహింసా చౌక్ లో వీరు తమ అనుచరులతో కలుసుకుని వాదించుకున్నారు. ఆ సమయంలో అటుగా వచ్చిన పోలీసులు, ఇరు వర్గాలను స్టేషన్ కు పిలిచారు. పోలీస్ స్టేషన్ కు చేరుకున్న ఇరు వర్గాలు అక్కడ కూడా వాదులాటకు దిగాయి. ఇది తీవ్ర రూపం దాల్చడంతో దాడులకు పాల్పడ్డారు. దీంతో ఒక వ్యక్తి హత్యకు గురికాగా, ఆరుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. అయితే, ఈ ఘటన స్టేషన్ బయట జరిగిందని ఎస్పీ చెప్పారు. 'కాదు స్టేషన్ లో పోలీసుల సమక్షంలోనే జరిగింద'ని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కావాలంటే సీసీ టీవీ ఫుటేజ్ చూడాలని బాధితులు పేర్కొంటున్నారు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News