: ఎన్టీఆర్ సభకు విపరీతంగా జనాలు వచ్చారు... నాకేమో విపరీతంగా ఓట్లు పడ్డాయి!: వెంకయ్యనాయుడు
1978 అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఎలాగైనా ఓడించాలని కాంగ్రెస్ పార్టీ ఏకంగా ఇందిరా గాంధీని ప్రచార రంగంలోకి దించిందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. అయినప్పటికీ ప్రజలు తనను గెలిపించారని చెప్పారు. ఆ తరువాత 1984లో ఎన్నికలు జరిగినప్పుడు అంతా ఎన్టీఆర్ ప్రభంజనం కొనసాగుతోందని...ఆ సమయంలో ఓ రోజు అర్ధరాత్రి డాక్టర్ వెంకటేశ్వరరావు తండ్రిగారు చెంచురామయ్యగారి నుంచి ఫోన్ వచ్చిందని ఆయన గుర్తు చేసుకున్నారు. 'ఏంటి సార్?' అనగానే... 'నాయుడు! పెద్దాయన (ఎన్టీఆర్) ఎన్నికల ప్రచారంలో భాగంగా మీ నియోజకవర్గంలో ఓ ఊరు ఉంది, ఆయన మీరు, జైపాల్ రెడ్డి సభలో ఉండాలని కోరుకుంటున్నారు. అందుకని ఇప్పుడు అక్కడ ప్రచారం చేయాలంటే ఇబ్బంది పడుతున్నారు... పోనీ ఆ ఊరు తప్పించేసి వెళ్లిపొమ్మంటావా?' అని అడిగారని ఆయన తెలిపారు. అప్పుడు తాను 'అలా చేయకండి, మీరు అలా చేస్తే ఎన్టీఆర్ వల్ల గెలిచానని నేను మధనపడాలి, నా వ్యక్తిత్వం అలాంటిది కాదు...మీ ప్రచారం మీరు చేసుకోండి, నా పని నేనే చూసుకుంటా'నని ఆయనకు సమాధానం చెప్పానని అన్నారు. ఆ రోజు జరిగిన ఎన్టీఆర్ సభకు భారీ ఎత్తున జనాలు చేరుకున్నారని, అదో అద్భుతమైన సభ అని ఆయన గుర్తు చేసుకున్నారు. అయితే, ఎన్నికల్లో మాత్రం టీడీపీ అభ్యర్థి ధరావతు కోల్పోయాడని, తనకు ఓట్లు వేశారని ఆయన చెప్పారు. తరువాత నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు పొడిచినప్పుడు...ఆయన నటుడనో లేక, ఫేమ్ ఉందనో ఎన్టీఆర్ కు మద్దతు తెలపలేదని అన్నారు. రాజకీయాల్లో విలువలు ఉండాలని, జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడ్డానని ఆయన చెప్పారు.