: ‘ఉడ్తా పంజాబ్’ విడుదలకు తొలగిన అడ్డంకులు.. రేపే విడుదల!
ఎన్నో మలుపులు తిరిగి చివరికి సుప్రీం కోర్టుకు చేరిన బాలీవుడ్ చిత్రం ‘ఉడ్తాపంజాబ్’ వివాదానికి తెరపడింది. ఎట్టకేలకు ఈ సినిమా విడుదలకు సిద్ధమయింది. ఈ చిత్రం విడుదలపై స్టే విధించాలంటూ పంజాబ్‌కు చెందిన ఓ ఎన్జీవో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌ను దేశ అత్యున్నత న్యాయస్థానం ఈరోజు తిరస్కరించింది. అయితే పంజాబ్-హరియాణా హైకోర్టుకు వెళ్లమని చెప్పింది. సదరు ఎన్జీవో పంజాబ్-హరియాణా హైకోర్టును ఆశ్రయించినా లాభం లేకపోయింది. ఆ రాష్ట్రాల హైకోర్టు కూడా ఈ సినిమా విడుదలపై స్టే పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో ఉడ్తా పంజాబ్ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. సినిమాను రేపు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేసుకుంటోంది.