: అమరావతికి తరలిన తొలి కార్యాలయం... మత్స్యశాఖ ఆఫీసు ప్రారంభం
నవ్యాంధ్ర రాజధాని అమరావతికి 27లోగా అన్ని శాఖల కార్యాలయాలూ తరలిరావాల్సిందేనని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. అమరావతికి తరలివచ్చిన తొలి విభాగంగా రాష్ట్ర మత్స్యశాఖ నిలువగా, పెనమలూరులో అద్దెకు తీసుకున్న భవంతిలో ఆఫీసును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చినరాజప్ప మాట్లాడుతూ, అన్ని శాఖల అధిపతులు, ప్రధాన అధికారులు మరో పది రోజుల్లో వచ్చేస్తారని తెలిపారు. ఆపై ఉద్యోగులు సైతం వచ్చేస్తారని పేర్కొన్నారు. మత్స్యశాఖ కార్యాలయంలో 60 మంది ఉద్యోగులు పనిచేస్తారని తెలిపిన ఆయన, 25న గుంటూరులో వ్యవసాయ శాఖ రాష్ట్ర కార్యాలయం ప్రారంభమవుతుందని వివరించారు. 20న ఏరువాక పౌర్ణమిని వైభవంగా జరుపుతామని, పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగే కార్యక్రమానికి సీఎం హాజరవుతారని చినరాజప్ప తెలియజేశారు.