: తల్లిదండ్రులు పిల్లల్లో సేవాభావాన్ని పెంపొందించాలి: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు కృష్ణా జిల్లా ఆత్కూరు స్వర్ణభారత్ ట్రస్ట్‌లో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. 55 మండలాలకు చెందిన విద్యార్థులకు ఆయన ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని అన్నారు. పిల్లల్లో సేవాభావం పెంపొందించాలని చంద్రబాబు విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు. తల్లిదండ్రుల తరువాత గురువులకి సమాజంలో అంతటి గౌరవం ఉందని ఆయన అన్నారు. అన్ని స్కూళ్లలో ఈ-అటెండెన్స్ లు ప్రవేశపెట్టనున్నామని, విద్యార్థుల హాజరు వివరాలు తల్లిదండ్రులకు తెలియజేస్తామని చంద్రబాబు చెప్పారు. పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ తీసుకొస్తున్నామని ఆయన అన్నారు. స్వర్ణ భారత్ ట్రస్ట్, ముప్పవరపు ఫౌండేషన్ ద్వారా వెంకయ్య నాయుడు చేస్తోన్న సేవలు గొప్పవని ఆయన ప్రశంసించారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాస రావు, కామినేని, మాణిక్యాలరావు, కొల్లు రవీంద్ర పాల్గొన్నారు.