: వసతిఖర్చులు ఇవ్వలేదని సదస్సుకు డుమ్మాకొట్టనున్న త్రిపుర మంత్రి
గోవాలో కేంద్ర విద్యుత్ శాఖ నిర్వహించ తలపెట్టిన సదస్సుకి త్రిపుర విద్యుత్ శాఖ మంత్రి డుమ్మాకొడుతున్నారు. అయితే ఏవో వ్యక్తిగత కారణాల వల్లో, మరేదైనా ముఖ్యమైన పనులు ఉండో కాదు..! గోవాలో సదస్సుకు హాజరుకావడానికి తనకు కావాల్సిన వసతి ఖర్చులు ప్రభుత్వం ఇవ్వలేదన్న కారణంతో ఆయన సదస్సుకు డుమ్మాకొడుతున్నారు. గోవా పర్యటనకు తనకు వసతి ఖర్చులు ఇవ్వలేదని, అందుకే విద్యుత్ శాఖ నిర్వహిస్తోన్న సదస్సుకు హాజరు కావడంలేదని త్రిపుర విద్యుత్ మంత్రి మాణిక్ డే తెలిపారు. తాము గోవాలో నిర్వహించనున్న సదస్సుకు త్రిపుర మంత్రి, అధికారులు హాజరు కావాలని, దాని కోసం రాష్ట్రప్రభుత్వమే వారి వసతులకయ్యే ఖర్చు భరించాలని త్రిపుర ప్రభుత్వానికి కేంద్ర విద్యుత్ శాఖ తెలిపింది. అయితే ఈ అంశాన్ని త్రిపుర ప్రభుత్వం తిరస్కరించింది. తాము మంత్రి, అధికారులకయ్యే ఖర్చు భరించబోమని ఆ రాష్ట్ర విద్యుత్ శాఖ కార్యదర్శి కేంద్రానికి స్పష్టం చేశారు. తమ వసతికయ్యే ఖర్చుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వడానికి నిరాకరించడంతో త్రిపుర విద్యుత్ మంత్రి మాణిక్ డే సదస్సుకు హాజరుకాలేనని చెప్పారు.