: రోహిత్ వేముల దళితుడే!... తేల్చేసిన గుంటూరు కలెక్టర్!
హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో నెలల తరబడి ఉద్రిక్త వాతావరణానికి కారణమైన రీసెర్చి స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యకు సంబంధించిన ఘటనలో నిన్న ఓ కీలక ప్రకటన వెలువడింది. రోహిత్ వేముల దళిత వర్గానికి చెందిన వాడని అతడు ప్రాతినిధ్యం వహించిన విద్యార్థి సంఘం ప్రకటిస్తే... అతడు దళితుడే కాదంటూ వ్యతిరేక వర్గం వాదించింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై దర్యాప్తు చేసి రోహిత్ వేముల కులాన్ని నిర్ధారించాలని గుంటూరు కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రంగంలోకి దిగిన గుంటూరు కలెక్టర్ కాంతిలాల్ దండే... తన నివేదికను జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ కు అందజేశారు. ఈ నివేదికలో రోహిత్ వేములను ఆయన దళితుడిగానే పేర్కొన్నారు. గుంటూరు తహశీల్దార్ వద్ద ఉన్న సమాచారం, తాము సేకరించిన సాక్ష్యాధారాల ప్రకారం రోహిత్ పూర్తి పేరును రోహిత్ వేముల చక్రవర్తిగా కలెక్టర్ పేర్కొన్నారు. దళిత వర్గంలోని మాల సామాజిక వర్గానికి చెందిన రోహిత్ వేముల కుటుంబం దారిద్య్ర రేఖకు దిగువన ఉందని ఆ నివేదికలో కాంతిలాల్ స్పష్టం చేశారు.