: కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే ప్రశంసలు!... దళిత యువకుడికి రూ.29 లక్షలిచ్చిన సీఎంను ఆకాశానికెత్తిన ఎన్వీఎస్ఎస్
తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్, విపక్ష బీజేపీల మధ్య తరచూ మాటల తూటాలు పేలుతున్నాయి. అయితే గుండె ఆపరేషన్ అవసరమైన ఓ దళిత యువకుడికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కేసీఆర్ ఏకంగా రూ.29,29,400లను విడుదల చేశారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ (ఉప్పల్) రాజకీయ శత్రుత్వాన్ని వీడారు. కేసీఆర్ గొప్పతనాన్ని కీర్తిస్తూ... కేసీఆర్ మానవత్వానికి ఈ ఘటనే నిలువెత్తు నిదర్శనమంటూ ఆకాశానికెత్తేశారు. ఈ ఆసక్తికర ఘటన నిన్న ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో చోటుచేసుకుంది. ఉప్పల్ నియోజకవర్గంలోని హబ్సిగూడకు చెందిన దళిత యువకుడు నవీన్ కుమార్ కు గుండె ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. అయితే అంత ఖర్చు పెట్టి చికిత్స చేయించుకోలేని నవీన్ కుమార్ ఎన్వీఎస్ఎస్ ను ఆశ్రయించాడు. బాధిత యువకుడి విపత్కర పరిస్థితిపై చలించిన ఎన్వీఎస్ఎస్... అతడితో సీఎం రిలీఫ్ పండ్ కు దరఖాస్తు చేయించారు. నేరుగా సీఎం కేసీఆర్ ను కలిసిన ఎన్వీఎస్ఎస్ పరిస్థితిని వివరించినట్లు సమాచారం. ఈ క్రమంలో నిబంధనలను పక్కనపెట్టేసిన కేసీఆర్... నవీన్ కుమార్ కు ఆపరేషన్ కు అవసరమైన మొత్తాన్ని విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నవీన్ కుమార్ కు విజయవంతంగా ఆపరేషన్ ముగిసింది. ఈ మేరకు విడుదలైన చెక్కును నిన్న ఎన్వీఎస్ఎస్ బాధిత యువకుడికి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎన్వీఎస్ఎస్... కేసీఆర్ ను మానవత్వమున్న నేతగా అభివర్ణించారు. గుండె ఆపరేషన్ అవసరమైన దళిత యువకుడికి ప్రాణదానం చేసేందుకు సీఎం కేసీఆర్ పూర్తి సాయం చేసి మానవత్వాన్ని చాటుకున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ మానవత్వానికి ఈ ఒక్క ఘటన నిలువెత్తు నిదర్శనమని కూడా ఆయన పేర్కొన్నారు.