: గులాబీ కండువా కప్పుకోకుండానే టీఆర్ఎస్ లో చేరిన గుత్తా!... కేసీఆర్ కూడా గుర్తించని వైనం!
హైదరాబాదులోని తెలంగాణ భవన్ వేదికగా నిన్న కాంగ్రెస్ పార్టీ నేతలు గుత్తా సుఖేందర్ రెడ్డి, వివేక్ బ్రదర్స్, ఎమ్మెల్యే భాస్కరరావు, సీపీఐ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ లు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. నల్లగొండ పార్లమెంటు సభ్యుడిగా ఉన్న గుత్తా టీఆర్ఎస్ చేరికే ఈ కార్యక్రమంలో హైలెట్. అయితే సంప్రదాయానికి విరుద్ధంగా గుత్తా గులాబీ కండువా కప్పుకోకుండానే టీఆర్ఎస్ లో చేరిపోయారు. టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాకకు ముందే వేదిక మీదకు చేరిన గుత్తా.. ఆ తర్వాత వచ్చిన కేసీఆర్ కు స్వాగతం పలుకుతూ పుష్ప గుచ్ఛం అందజేశారు. ఆ తర్వాత వివేక్, వినోద్ లతో పాటు భాస్కరరావు, రవీంద్ర నాయక్ లకు పార్టీ కండువాలు కప్పిన కేసీఆర్... గుత్తా మెడలో పార్టీ కండువా వేయడాన్ని పూర్తిగా మరిచిపోయారు. దీనిని అంతగా పట్టించుకోని గుత్తా కూడా కండువా కోసం ఎదురుచూడలేదు. ఆ తర్వాత పార్టీలో చేరిన కొత్తవారితో కలిసి కేసీఆర్ వేదిక మీదే ఫొటోలకు పోజిచ్చారు. ఈ ఫొటోలోనూ మిగతా వారి మెడల్లో గులాబీ కండువాలు ఉండగా, గుత్తా మెడలో మాత్రం కండువా కనిపించలేదు. కేసీఆర్ తో పాటు గుత్తా కూడా కండువాలు లేకుండానే కనిపించారు.