: ముద్రగడ దీక్ష ఎఫెక్ట్!... కోనసీమలో ‘హెరిటేజ్’ లారీపై కాపుల దాడి!
కాపు ఐక్య వేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ దీక్షకు సంబంధించి నిన్న పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఓ వైపు ప్రభుత్వం నెరపిన రాయబారం నేపథ్యంలో ముద్రగడ దీక్షను విరమించారని వార్తలు వినిపించాయి. అప్పటిదాకా వైద్యానికి ససేమిరా అన్న ముద్రగడ... ఫ్లూయిడ్స్ ఎక్కించుకునేందుకు ఒప్పుకున్నారు. ఈ క్రమంలో ఆయన దీక్ష విరమించినట్టేనని ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. అయితే తన తండ్రి దీక్ష విరమించలేదని ముద్రగడ కుమారుడు ప్రకటించారు. ఇదే సమయంలో ముద్రగడ దీక్ష నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాల్లో రోజుల తరబడి కొనసాగుతున్న నిరసన ప్రదర్శనలు నిన్న కూడా పలు ప్రాంతాల్లో జరిగాయి. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం పలివెలలో ఆందోళనకు దిగిన కాపులు... తమకు కనిపించిన హెరిటేజ్ ఫుడ్స్ లారీపై విరుచుకుపడ్డారు. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కుటుంబ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆ కంపెనీ వాహనం కనిపించగానే ఆగ్రహావేశాలకు గురైన కాపులు దానిపై దాడికి దిగారు. ఈ దాడిలో హెరిటేజ్ లారీ అద్దాలు పగిలిపోయాయి. మరోవైపు జిల్లాలోని పలు ప్రాంతాల్లోనూ కాపులు నిరసనలు కొనసాగించారు. పలు ప్రాంతాల్లో రోడ్డెక్కిన కాపులు వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కాపులు తమను అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు.