: నాన్న దీక్ష విరమించలేదు...ప్రభుత్వం పదేపదే కోరడంతో బ్లడ్ శాంపిల్ ఇచ్చారు!: ముద్రగడ తనయుడు


కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం దీక్ష విరమించారని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఆయన కుమారుడు బాలు తెలిపారు. రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం దీక్ష విరమించాలని కోరిందని అన్నారు. మీ డిమాండ్లు నెరవేర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దీక్ష విరమించాలని పదేపదే కలెక్టర్, విశాఖ రేంజ్ డీఐజీ కోరినా తన తండ్రి అంగీకరించలేదని, జేఏసీ ఆందోళన చెందడంతో పరీక్షల కోసం బ్లడ్ శాంపుల్ ఇచ్చారని అన్నారు. జేఏసీ కోరక మేరకు సెలైన్ బాటిల్ ఎక్కించుకున్నారని ఆయన చెప్పారు. అంతే కానీ ఆయన దీక్ష విరమించలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున వచ్చిన ప్రతినిధులతో, తుని ఘటనలో అరెస్టు చేసిన 13 మందిని విడుదల చేశాక మాట్లాడమని చెప్పారని ఆయన తెలిపారు. అలాగే తమను ఎలా తీసుకువచ్చారో, అలా గౌరవంగా తమను కిర్లంపూడిలో వదిలిపెడితే అక్కడ దీక్ష విరమణ చేస్తామని ఆయన చెప్పారని బాలు తెలిపారు.

  • Loading...

More Telugu News