: బిర్యానీలోనూ రసాయనాలు.. తేల్చి చెప్పిన కేఎంసీ అధికారులు
ఇటీవల ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో లభించే బ్రెడ్‌ను శాంపిల్స్ గా తీసుకొని తాము జరిపిన పరీక్షల్లో కేన్సర్ కారక రసాయనాలు బయటపడ్డాయని సీఎస్ఈ నిర్ధారించిన సంగతి తెలిసిందే. పొటాషియం బ్రోమేట్, పొటాషియం అయోడెట్ వంటి కేన్సర్ కారక రసాయనాలు వాటిల్లో ఉన్నాయని పరిశోధకులు తెలిపారు. అయితే ఇప్పుడు మనం రోజూ ఎంతగానో ఇష్టపడి తినే బిర్యానీలో కూడా రసాయనాలు ఉన్నట్లు కోల్ కతా మున్సిపల్ కార్పొరేషన్ (కేఎంసీ) అధికారులు తేల్చి చెబుతున్నారు. కోల్‌కతాలోని పలు హోటళ్లలో బిర్యానీ శాంపిల్స్‌ని సేకరించి తాము చేసిన పరీక్షల్లో ఈ అంశం బయటపడిందని చెప్పారు. దీనిపై బెంగాల్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. తాము చేసిన పరీక్షల్లో బిర్యానీలో కేన్సర్ కారక మెటానిల్ ఎల్లో రసాయనం ఉన్నట్లు నిర్ధారణ అయిందని కేఎంసీ అధికారులు చెప్పారు. దీనికి కారణం బియ్యం పసుపురంగులోకి మారడానికి యజమానులు మెటానిల్ ఎల్లో అనే రసాయనం వాడడమేనని అధికారులు చెప్పారు. ఈ రసాయనం తక్కువ ధరకు లభిస్తుండడంతో యజమానులు బిర్యానీలో బియ్యం పసుపు రంగులోకి మారడానికి కుంకుమపువ్వును ఉపయోగించకుండా మెటానిల్ ఎల్లోని ఉపయోగిస్తున్నారని అధికారులు వెల్లడించారు.