: కేసీఆర్ ప్రభుత్వంపై దిగ్విజయ్ విసుర్లు
తెలంగాణలో కాంగ్రెస్‌ను తిరిగి బలపరచే దిశగా కాంగ్రెస్ అధిష్ఠానం చర్యలు చేపట్టింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలాన్ని పెంచడమే లక్ష్యంగా హైదరాబాద్ చేరుకున్న ఏఐసీసీ నేత దిగ్విజయ్ సింగ్.. ఉత్తమ్ కుమార్, జానారెడ్డిలతో పాటు పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలతో గాంధీభవన్‌లో కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దిగ్విజయ్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలను కేసీఆర్ సర్కార్ దోపిడీ చేస్తోందని వ్యాఖ్యానించారు. సాగునీటి ప్రాజెక్టుల అంచనాలను కేసీఆర్ ప్రభుత్వం పెంచేసిందని ఆయన అన్నారు. తద్వారా ప్రభుత్వం నిధుల దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. భూసేకరణ చట్టాన్ని అమలుపరచకుండా ముంపు బాధితులను రాష్ట్ర ప్రభుత్వం కష్టాలకు గురిచేస్తోందని, వారికి ఇవ్వాల్సిన పరిహారం చెల్లించడం లేదని ఆయన అన్నారు.