: ఢిల్లీలో మళ్లీ కుట్రలు మొదలయ్యాయి: కేసీఆర్
తెలంగాణ రావాలని ఎంతగానో పోరాడామని, ఎన్నో ధర్నాలు, బంద్‌లు తరువాత, ఎన్నో ఆటంకాలు ఎదురైన తరువాత తెలంగాణ రాష్ట్రం వచ్చిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోని టీఆర్ఎస్ భవన్‌లో గుత్తా సుఖేందర్ రెడ్డి, వివేక్, వినోద్, భాస్కర్ రావు, జువ్వాడి నర్సింగ్ రావు, రవీంద్ర నాయక్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ‘మళ్లీ ఢిల్లీలో కుట్రలు మొదలయ్యాయి.. రాష్ట్రపతి పాలన పెట్టించాలనే కుట్ర జరుగుతోంది’ అని కేసీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజలు తెలివిగా ఉండాలని ఆయన అన్నారు. ‘తెలంగాణ తన కాళ్ల మీద తాను నిలబడింది.. మళ్లీ మన పాలనను చేజార్చుకోవద్ద’ని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తెలంగాణలో చరిత్రలో ఎవరూ ఊహించని అభివృద్ధి పనులు జరుగుతున్నాయని కేసీఆర్ అన్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని కాంగ్రెస్ నేత జానారెడ్డి విమర్శలు గుప్పిస్తున్నారని కేసీఆర్ అన్నారు. ‘జానారెడ్డిని అడుగుతున్నా.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయింపులు జరగలేదా..?’ అని ఆయన ప్రశ్నించారు. మీరు చేస్తే కరెక్టు, వేరే వాళ్లు చేస్తే తప్పా..? అని ఆయన దుయ్యబట్టారు.