: ఇన్వెస్టర్ల దగ్గర కుప్పలు తెప్పలుగా డబ్బు: బీఓఎఫ్ఏ-ఎంఎల్ రిపోర్టు


అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న పలు రకాల భయాందోళనల కారణంగా, ఏ రంగంలోనూ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా లేకపోవడంతో, ఇన్వెస్టర్ల దగ్గర భారీ ఎత్తున నగదు మిగిలిపోయిందని బ్యాంక్ ఆఫ్ అమెరికా, మెర్రిల్ లించ్ (బీఓఎఫ్ఏ-ఎంఎల్) నిర్వహించిన ఫండ్ మేనేజర్ సర్వేలో వెల్లడైంది. గడచిన 15 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత డబ్బు గ్లోబల్ ఇన్వెస్టర్ల వద్ద మూలుగుతోందని, ఈక్విటీ కేటాయింపులు నాలుగేళ్ల కనిష్ఠానికి పడిపోయాయని ఈ సర్వే తరువాత బీఓఎఫ్ఏ-ఎంఎల్ రిపోర్టు పేర్కొంది. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలుగుతుందని వస్తున్న వార్తలకు తోడు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమావేశం జరగనుండటం, పెరుగుతున్న ముడి చమురు ధరలు వంటి అంశాలెన్నో ఇన్వెస్టర్లను నూతన పెట్టుబడులకు దూరంగా ఉంచాయని అంచనా వేసింది. ప్రస్తుతం ఇన్వెస్టర్ల వద్ద ఉన్న నగదు స్థాయులు, వారి పోర్టుఫోలియోల్లో 5.7 శాతానికి పెరిగాయని, నవంబర్ 2001 తరువాత ఇది అత్యధికమని బీఓఎఫ్ఏ-ఎంఎల్ తెలియజేసింది. అయితే, ఇన్వెస్టర్లు అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో పెడుతున్న పెట్టుబడులు 21 నెలల గరిష్ఠానికి చేరాయని, ఇది భారత్ వంటి దేశాలకు మేలును కలిగిస్తోందని వెల్లడించింది. అమెరికా కార్పొరేట్ బాండ్లు, యూఎస్ స్టాక్ మార్కెట్లో ఈక్విటీల ధరలు లాభాల్లో ఉన్న కారణంగా ఎవరూ కొత్త పెట్టుబడులు పెట్టడం లేదని, కొనుగోలు అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారని బీఓఎఫ్ఏ-ఎంఎల్ చీఫ్ ఇన్వెస్ట్ మెంట్ వ్యూహకర్త మైఖేల్ హార్ట్ నెట్ వివరించారు. దాదాపు 654 బిలియన్ డాలర్ల పెట్టుబడులను నిర్వహిస్తున్న 213 మంది తమ సర్వేలో పాల్గొన్నారని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News