: అప్పుడు స్పందించని కాంగ్రెస్ ఇప్పుడు కలసి పోరాడదామంటోంది: రేవంత్ రెడ్డి
టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ లోకి కాంగ్రెస్ నేతలు జంప్ అవడంతో ఆ పార్టీకి తగిన శాస్తి జరిగిందని ఆయన అన్నారు. ఈరోజు హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. కొన్ని నెలల క్రితం టీడీపీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ ఆకర్షిస్తున్నప్పుడే ఆ విషయంపై కేసీఆర్ తీరును ప్రశ్నించమని తాను కాంగ్రెస్ నేతలను కోరినట్లు ఆయన తెలిపారు. ఈ విషయమై ప్రశ్నించాలని తాను కాంగ్రెస్ నేతలను పలుసార్లు అడిగానని ఆయన చెప్పారు. అప్పుడు స్పందించని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు అందరం కలసి గళం విప్పుదామని అంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ ఫిరాయింపులపై మరోవైపు బీజేపీ కూడా స్పందించడం లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ నేతలను ఆకర్షించిన తరువాత బీజేపీ నేతలపై కేసీఆర్ దృష్టి పెడతారని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు.