: నాన్నా! అమ్మతో ఎందుకు వుండవు?: కోల్ కతా హైకోర్టును కదిలించిన ఆరేళ్ల చిన్నారి ప్రశ్న


"నాన్నా... నువ్వెందుకు అమ్మతో కలిసివుండవు? నేను నీతోనే ఉంటానని కోర్టుకు ఎందుకు చెప్పలేవు?" అని ఆరేళ్ల పాప ఏడుస్తూ, న్యాయమూర్తుల ముందే తన తండ్రిని అడిగిన ప్రశ్న అక్కడున్న అందరి మనసులనూ కదిలించి వేసింది. అక్క ఏడుపు చూసి, నాలుగేళ్ల తమ్ముడు కూడా కన్నీరు కార్చుతూ, "అక్క నాన్న దగ్గరుంటే, నేనూ అక్కడికే పోతాను" అనడంతో, అదే గదిలో ఓ మూలనున్న వారి తల్లి రోదించడం మనసులను ఇంకా బరువెక్కించింది. కోల్ కతా హైకోర్టులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్వపరాల్లోకి వెళితే, సిలిగురీలో 2005లో కలిసిన ముస్లిం పురుషుడు, హిందూ మహిళ ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. వీరికి 2010లో పాప, 2012లో బాబు పుట్టారు. ఆ తరువాత భర్త ప్రవర్తనపై ఆమెకు అనుమానం వచ్చి విడిపోయింది. పిల్లలను తీసుకుని ఆమె వెళ్లిపోగా, సిలిగురి కోర్టును భర్త ఆశ్రయించాడు. గత ఫిబ్రవరిలో బాలిక తండ్రితో ఉండాలని, బాలుడు తల్లితో ఉండాలని కోర్టు తీర్పిచ్చింది. దీంతో బలవంతంగా తన కుమార్తెను తల్లి నుంచి వేరు చేశాడు అతను. దీన్ని కోల్ కతా హైకోర్టులో తల్లి చాలెంజ్ చేసింది. కేసు న్యాయమూర్తులు నిశితా మాత్రే, రాకేష్ తివారీల బెంచ్ ముందుకు వచ్చింది. అప్పటికే సమ్మర్ హాలిడేస్ ప్రారంభం కావడంతో, ఇద్దరు పిల్లలూ తల్లి వద్ద ఉండాలని మధ్యంతర తీర్పిచ్చిన ధర్మాసనం, తిరిగి ఇప్పుడు కేసు విచారణను చేపట్టింది. కేసు విచారణ జరుగుతుండగా, న్యాయమూర్తుల ముందు ఆ పిల్లలు చేసిన వ్యాఖ్యలు, వారి ఏడుపూ క్షణాల్లో పక్క కోర్టు గదుల్లోని వారికి తెలియడంతో ఆ హాలంతా కిక్కిరిసి పోయింది. కేసును న్యాయమూర్తులు వాయిదా వేసినప్పటికీ, పిల్లలను చూడాలన్న కోరికతో అత్యధిక సంఖ్యలో లాయర్లు, ప్రజలు అక్కడే ఉండటంతో కోర్టు పనులకు ఆటంకం ఏర్పడింది. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు, వారి తల్లిదండ్రులను బయటకు వెళ్లాలని ఆదేశించి, జనాలను అక్కడి నుంచి పంపేశారు. ఓ కానిస్టేబుల్ పిల్లల వద్దకు వచ్చి "కిందకు పోయి కూల్ డ్రింక్స్ తాగుదాం" అని చెప్పి బయటకు నడిపించగా, కళ్ల వెంట కట్టిన నీటి చారలు తొలగకుండానే, వారి పెదాలపై కనీకనిపించని చిరునవ్వు దోబూచులాడింది.

  • Loading...

More Telugu News