: ఓర్లాండోలో ఘోరం... రెండేళ్ల చిన్నారిని లాక్కెళ్లిన మొసలి, మాసివ్ సెర్చ్ ఆపరేషన్ ఫలించేనా?
అమెరికాలోని ఓర్లాండోకు సమీపంలోని డిస్నీ గ్లాండ్ ఫ్లోరిడియన్ రిసార్ట్ అండ్ స్పాకు విహారం నిమిత్తం వచ్చిన ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. నెబ్రాస్కా నుంచి ఐదుగురు సభ్యులున్న ఓ కుటుంబం మంగళవారం సాయంత్రం రిసార్టుకు వచ్చి, ఇక్కడున్న ఓ సరస్సు ముందు సేదదీరుతుండగా, నీటిలోని మొసలి ఒక్కసారిగా బయటకు వచ్చి, రెండేళ్ల చిన్నారిని లాక్కెళ్లిపోయిందని ఆరంజ్ కౌంటీ షరీఫ్ జెర్రీ డెమింగ్స్ వెల్లడించారు. ఆ వెంటనే చిన్నారి కోసం 50 మంది భద్రతాధికారులతో కూడిన బృందం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించిందని వివరించారు. ఘటన జరిగిన ఐదారు గంటల తరువాత వరకూ కూడా బాలుడి జాడ తెలియలేదు. ఈ సరస్సు వద్ద మొసళ్ల సంచారం, ఈ తరహా దాడులపై ఇటీవలి కాలంలో ఫిర్యాదులేవీ రాలేదని, చిన్నారిని మొసలి లాక్కెళుతుంటే, రక్షించేందుకు అతని తండ్రి చేసిన ప్రయత్నాలు ఫలించలేదని డెమింగ్స్ తెలిపారు. కాగా, బాలుడు ప్రాణాలతో ఉండే అవకాశాలు ఎంతమాత్రమూ లేవని తెలుస్తోంది.