: వెయ్యి పాఠశాలల్లో డిజిటల్ తరగతులు ప్రారంభించడమే లక్ష్యం: కేటీఆర్
డిజిటల్ అక్షరాస్యతను పెంచడాన్ని ఓ లక్ష్యంగా పెట్టుకున్నామని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్, బేగంపేటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ ఐటీ శాఖ వార్షిక నివేదికను ఆయన ఈరోజు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలను వెల్లడించారు. గతేడాది లక్షమంది డిజిటల్ అక్షరాస్యతను సాధించారని ఆయన పేర్కొన్నారు. వెయ్యి పాఠశాలల్లో డిజిటల్ తరగతులు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. ఐటీ రంగంలో పనిచేసే మహిళల భద్రతకు ప్రత్యేక యాప్‌లను ప్రారంభించినట్లు ఆయన చెప్పారు. ఐటీ రంగంలో లక్షలాదిగా ఉన్న ఉద్యోగుల అభివృద్ధికి సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. నిపుణుల సలహాతో ఐటీ విధానం ప్రకటించామని కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వంలోని 26 విభాగాలు విస్తృతంగా ఐటీ విధానాన్ని వినియోగిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. మీ సేవ ద్వారా మరిన్ని సేవలు అందించడానికి కృషి చేస్తున్నామన్నారు. మీ సేవను గ్రామీణ స్థాయికి తీసుకెళ్లేందుకు ఈ-పంచాయతీలను ప్రారంభించామని ఆయన చెప్పారు. ఐటీని ద్వితీయ శ్రేణి పట్టణాలకు తీసుకెళ్లేందుకు చేస్తోన్న కృషి మంచి ఫలితాలను ఇస్తోందని కేటీఆర్ తెలిపారు. చిన్న చిన్న పట్టణాల్లో కూడా రూరల్ బీపీవోలు ప్రారంభమవుతాయని చెప్పారు.