: ప్రాణం తీసుకోవాలనుకున్న టెక్కీ ప్రయత్నాన్ని భగ్నం చేసిన ఫేస్ బుక్ ఫ్రెండ్స్


దేశ రాజధాని న్యూఢిల్లీకి సమీపంలోని గుర్గావ్ లో ఓ ఐటీ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగి వరుణ్ మాలిక్, ఆత్మహత్య చేసుకోవాలన్న ప్రయత్నాన్ని, అతని ఫేస్ బుక్ స్నేహితులు భగ్నం చేశారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, సెక్టార్ 10ఏలోని కర్మయోగి అపార్ట్ మెంటులో నివసించే 32 ఏళ్ల వరుణ్ తల్లి ఏడాది క్రితం మరణించారు. అప్పటి నుంచి దిగాలుగా, ఎవరితోనూ సరిగ్గా కలవకుండా ఉంటున్న వరుణ్, ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని, తన చేతి మణికట్టును కోసుకున్నాడు. దాన్ని ఫోటో తీసి, తానిక ఈ లోకంలో ఉండలేనంటూ ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు. దీన్ని చూసిన ఆయన స్నేహితులు వెంటనే వరుణ్ ఇంటికి బయలుదేరడంతో పాటు, పోలీసులకు అడ్రస్ చెప్పి సమాచారం ఇచ్చారు. వరుణ్ డాక్టర్ సోదరుడికీ విషయం చెప్పారు. వెంటనే వరుణ్ ను ఆసుపత్రిలో చేర్చి చికిత్సను ప్రారంభించినప్పటికీ, అతని పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. సూసైడ్ నోట్ గా "వరుణ్ అనే నేను నా ప్రాణాలను తీసుకుంటున్నాను. ఇందుకు ఎవరూ కారణం కాదు. ఎంతో కాలంగా నేను బాధలు అనుభవిస్తున్నాను. నన్ను అర్థం చేసుకునే వారెవరూ లేరు. నాకెవరూ లేరు. నేనో ఒంటరిని. మరణం ఒక్కటే నా ముందున్న ఒకే అవకాశం. ప్రశాంతంగా నా అంత్యక్రియలు పూర్తి చేయండి. అదే నా కోరిక" అని పోస్టు పెట్టాడు. వరుణ్ తల్లి తన కుమారుడి కోసం ఓ కిడ్నీని దానం ఇచ్చిందని, ఆపై రెండో కిడ్నీ చెడిపోయిన కారణంగా ఆమె మరణించడంతో, వరుణ్ లో నైరాశ్యం ఏర్పడిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఎటువంటి కేసూ నమోదు చేయలేదని, కోలుకుంటే వరుణ్ కు కౌన్సెలింగ్ ఇస్తామని వివరించారు.

  • Loading...

More Telugu News