: బీహార్ లో చదువుల 'మాయ'!... రూ.5 లక్షలిస్తే ఇంటర్ పాసైనట్లు సర్టిఫికెట్!
బీహార్ లో చదువులంతా డబ్బు మయమైపోయాయి. ఇప్పటికే ఆ రాష్ట్రంలో టాపర్ల స్కాం కలకలం రేపుతుండగా, తాజాగా కాలేజీకి వెళ్లకున్నా ఇంటర్ సర్టిఫికెట్లు దొరికిపోతున్నాయట, ఈ మేరకు నిన్న ఆ రాష్ట్ర రాజధాని పాట్నాలోని ఓ కళాశాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం దాడి చేసిన సందర్భంగా ఈ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. పరీక్షలకు హాజరుకాకున్నా... ఏకంగా ఏ కళాశాలలోనూ పేరు నమోదు కాకున్నా కూడా అక్కడ ఇంటర్ పాసైనట్లు సర్టిఫికెట్లు దొరుకుతున్నాయి. డిగ్రీ స్కాంలో పట్టుబడ్డ ఓ నిందితుడు ఈ విషయాన్ని వెల్లడించాడు. ఇలా పరీక్ష రాయకుండా, ఏ కళాశాలలో పేర్లు నమోదు చేసుకోని విద్యార్థులు రూ.5 లక్షలు ఇచ్చేస్తే ఇంటర్ సర్టిఫికెట్లు లభ్యమవుతున్నాయి. పాట్నాలోని గంగాదేవి మహిళా కళాశాలలో తనిఖీలు చేసిన సిట్ బృందం ఈ విషయాన్ని నిగ్గుతేల్చింది. ఇక పరీక్షల స్కాంలో కీలక నిందితుడిగా ఉన్న బీహార్ బోర్డు ఎగ్జామ్ప్ చైర్మన్ లాల్ కేశ్వర్ ప్రసాద్ సింగ్ ను పోలీసులు ఇప్పటికీ పట్టుకోలేకపోయారు.