: వైసీపీ సమావేశానికి డుమ్మా కొట్టిన ఐదుగురు ఎమ్మెల్యేలు!... విజయసాయిరెడ్డి కూడా!


నవ్యాంధ్ర పొలిటికల్ కేపిటల్ విజయవాడలో నిన్న విపక్ష పార్టీ వైసీపీకి సంబంధించి తొలిసారిగా కీలక భేటీ జరిగింది. ఇప్పటిదాకా హైదరాబాదు కేంద్రంగానే లోటస్ పాండ్ లో ఆ పార్టీ సమావేశాలు జరగగా... రాష్ట్ర విభజన జరిగిన దాదాపు రెండేళ్లకు గాని ఆ పార్టీ ఏపీ బాట పట్టలేకపోయింది. ఈ క్రమంలో పార్టీకి చెందిన అన్ని స్థాయిల ప్రజా ప్రతినిధులు, నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే ఆ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు సమావేశంలో కనిపించలేదు. విదేశీ పర్యటనలో ఉన్న చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఈ సమావేశానికి హాజరు కాలేదు. ఇక పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపకు చెందిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, చిత్తూరు జిల్లా మదనపల్లె ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి, విశాఖ జిల్లా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఈ భేటీకి హాజరుకాలేదు. అయితే వీరు ముగ్గురు కూడా పార్టీ అధినేత జగన్ నుంచి అనుమతి తీసుకుని సమావేశానికి రాలేదని సమాచారం. ఇక చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే ఎన్.అమర్ నాథ్ రెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరుకాలేదు. గడచిన ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైసీపీలో చేరిన అమర్ నాథ్ రెడ్డి మళ్లీ సొంత గూటి వైపు చూస్తున్నారని వదంతులు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన గైర్హాజరీపై పార్టీలో కలకలమే రేగింది. ఇదిలా ఉంటే... ఇటీవలే పార్టీకి దక్కిన సింగిల్ రాజ్యసభ సీటును దక్కించుకున్న పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి కూడా ఈ సమావేశానికి రాలేదు. తన గైర్హాజరీకి గల కారణాన్ని ఆయన పార్టీ అధినేతకు ముందుగానే వివరించినట్లు సమాచారం. మరోవైపు ప్రకాశం జిల్లా సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేశ్ సమావేశానికి హాజరైనా... భేటీ ప్రారంభానికి ముందు జగన్ వద్ద అనుమతి తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు.

  • Loading...

More Telugu News