: కంప్యూటర్ గ్రాడ్యుయేట్ కు రూ. 1.1 కోట్ల ఆఫర్... టెక్కీలకు మూడు రెట్లు పెరిగిన సరాసరి వేతనం
క్యాంపస్ ప్లేస్ మెంట్లలో భాగంగా పశ్చిమ బెంగాల్ లోని జాదవ్ పూర్ యూనివర్శిటీకి చెందిన ఓ కంప్యూటర్ గ్రాడ్యుయేట్ ఆసిఫ్ అహ్మద్ కు గూగుల్ సంస్థ రూ. 1.1 కోట్ల వేతనాన్ని ఆఫర్ చేసింది. సింగపూర్ లోని గూగుల్ క్యాంపస్ లో పనిచేసేందుకు అవకాశాన్ని ఇచ్చింది. ఇంత భారీ ఆఫర్ లభిస్తుందని తాము ఊహించలేదని వర్శిటీ ప్లేస్ మెంట్ ఆఫీసర్ సమితా భట్టాచార్య వ్యాఖ్యానించారు. వర్శిటీ చరిత్రలో ఇది ఒ గొప్ప సందర్భమని వైస్ చాన్స్ లర్ సురంజన్ దాస్ తెలిపారు. మెకానికల్, కెమికల్, సివిల్ ఇంజనీరింగ్ వంటి కోర్ బ్రాంచ్ విద్యార్థులకు కూడా మంచి కంపెనీల నుంచి, చక్కని ప్యాకేజ్ తో కూడిన ఉద్యోగాలు వచ్చాయని ఆయన చెప్పారు. గత సంవత్సరం సరాసరి వేతనం రూ. 3 లక్షలు కాగా, ఈ ఏడాది అది మూడు రెట్లు పెరిగి రూ. 10 లక్షలకు చేరిందని వివరించారు. తమ వర్శిటీ బ్రిక్స్ దేశాల్లోని టాప్ -100 వర్శిటీల్లో స్థానం సంపాదించుకుందని ఆయన తెలిపారు. ఇక గూగుల్ అధికారుల ఇంటర్వ్యూ గురించి ఆసిఫ్ చెబుతూ, "వారు నన్ను చాలా ప్రశ్నలు అడిగారు. వాటిల్లో అత్యధికం నేను చదివిన సబ్జెక్ట్ గురించే. ముందుగానే ప్రిపేర్ కావడంతో ఇంటర్వ్యూ బాగా సాగింది. అయితే, శాలరీ ప్యాకేజ్ ని వారు చెప్పగానే నాకు ఎంతో ఆశ్చర్యం వేసింది. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాను" అన్నాడు. కన్ఫర్మేషన్ లెటరును గూగుల్ యాజమాన్యం అందించిందని, సెప్టెంబరులో జాయిన్ కావాలని వారు ఆదేశించారని తెలిపారు. తనకు ఇదే ప్లేస్ మెంట్ల సందర్భంగా అమేజాన్ రూ. 27 లక్షల ఆఫర్ ఇచ్చిందని వివరించాడు. కాగా, గూగుల్ ఆఫర్ తర్వాత ఈ యూనివర్శిటీ విద్యార్థులకు బెస్ట్ ప్యాకేజ్ గా 30 లక్షల స్థాయి వేతనంతో కూడిన ఉద్యోగాలు పలు వచ్చాయి. ఈ రేంజిలో విద్యార్థి విఖాయత్ ఖోస్లాకు మైక్రోసాఫ్ట్ సంస్థ, తన హైదరాబాద్ క్యాంపస్ లో పనిచేసేందుకు రూ. 30 లక్షల ప్యాకేజీ ఇచ్చింది.