: కిడ్నాపర్ల బారి నుంచి చాకచక్యంగా తప్పించుకున్న నెల్లూరు విద్యార్థిని
కాలేజీకి వెళుతున్న అమ్మాయిని ఆరుగురు వ్యక్తులు మత్తుమందు చల్లి కిడ్నాప్ చేయగా, ఆపై మెలకువ వచ్చిన ఆమె, అదను చూసి తప్పించుకున్న ఘటన నెల్లూరు పరిధిలో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఆత్మకూరు ప్రాంతానికి చెందిన షేక్ మస్తాన్ కుమార్తె మోనాజ్, నెల్లూరులో ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతోంది. రోజూ మాదిరిగానే నిన్న కాలేజీకి బయలుదేరగా, వనంతోపు సెంటర్ వద్ద కొందరు దుండగులు ఆమెపై మత్తుమందు చల్లి కారులో తీసుకెళ్లారు. వెంకటాచలం సమీపంలో కారును ఆపి వారు మద్యం తాగుతుండగా, మెలకువ వచ్చిన మోనాజ్, కారు డోరు తీసుకుని సమీపంలో కనిపిస్తున్న టోల్ ప్లాజా వైపుగా పరుగులు పెట్టింది. ఆమె పారిపోవడం చూసిన దుండగులు పరారు కాగా, టోల్ ప్లాజా సిబ్బంది విషయం తెలుసుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించి కారును గుర్తించే ప్రయత్నాలు ప్రారంభించారు.