: తెలంగాణ ప్రాజెక్టులు ఆపాలని కేంద్రానికి చంద్రబాబు లేఖ రాయలేదా..?: హరీశ్ ఫైర్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లాలోని హన్మకొండ మండలం కడిపికొండలో మిషన్ కాకతీయ పనులను ప్రారంభించిన హరీశ్‌రావు అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సాగునీటి ప్రాజెక్టులపై ఏపీ మంత్రులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులు ఆపాలని కేంద్రానికి చంద్రబాబు లేఖ రాయలేదా..? అని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధిని ఆపడం ఎవరి తరమూ కాదని ఆయన అన్నారు. బాబు హయాంలోనే కాళేశ్వరం, డిండీ ప్రాజెక్టులపై జీవో ఇవ్వలేదా..? అని ఆయన ప్రశ్నించారు. ‘చంద్రబాబువి బూటకపు మాటలు.. తెలంగాణ ప్రజలకు ఈ విషయం తెలుసు’ అని ఆయన అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవడం మానుకోవాలని ఆయన సూచించారు.