: సిద్దరామయ్యకు షాక్ తప్పదా?... కర్ణాటక రాజ్యసభ ఎన్నికల బేరసారాలపై సీబీఐ దర్యాప్తు షురూ!
కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు షాక్ తప్పేలా లేదు. ఇటీవల ముగిసిన రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి జేడీఎస్, ఇండిపెండెంట్ల ఓట్లను లాగేసిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో బాగానే లబ్ధి పొందింది. కాంగ్రెస్ పార్టీ బేరసారాల పుణ్యమా అని జేడీఎస్ తరఫున బరిలోకి దిగిన అభ్యర్థి ఓటమిపాలయ్యారు. ‘‘రూ.5 కోట్లిస్తే... మా ఓటు మీకే’’ అని స్వతంత్ర ఎమ్మెల్యేలతో పాటు జేడీఎస్ ఎమ్మెల్యేలు తమ ఓట్లను బేరానికి పెట్టిన వైనం స్టింగ్ ఆపరేషన్ కు దొరికిపోయింది. ఈ క్రమంలో కర్ణాటక రాజ్యసభ ఎన్నికలను వాయిదా వేయాలని ముందుగా భావించినా... ఆ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహణకే మొగ్గుచూపింది. అంతా భావించినట్లు జేడీఎస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారు. దీంతో 8 మంది ఎమ్మెల్యేలపై మాజీ ప్రధాని దేవేగౌడ ఆధ్వర్యంలోని జేడీఎస్ పార్టీ వేటు వేసింది. అయితే ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ క్రమంలో ఇప్పటికే సీబీఐ అధికారులు రంగంలోకి దిగిపోయారు. విచారణలో భాగంగా సీబీఐ అధికారులు సీఎం సిద్దూను స్వయంగా విచారించే అవకాశాలు లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది. ఇదే జరిగితే ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో చిక్కుకున్న సిద్దూకు మరింత విపత్కర పరిస్థితులు ఎదురుకానున్నాయి.