: ఇక ప్రతి శనివారం టీ టీడీపీ నేతలతో భేటీ: నారా లోకేశ్ కీలక నిర్ణయం
టీడీపీ యువనేత, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నిన్న కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ పాలన నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి తరలిపోతుండటం, పార్టీ ఏపీ శాఖలో మరింత కీలక భూమిక నేపథ్యంలో నారా లోకేశ్ వారంలో మెజారిటీ రోజులు విజయవాడలోనే ఉంటున్నారు. ఈ క్రమంలో పార్టీ తెలంగాణ విభాగం టీ టీడీపీపై గతంలో పెట్టినంత దృష్టి ఇప్పుడు పెట్టడం లేదు. ఈ క్రమంలో పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు నిన్న టీ టీడీపీ నేతలతో హైదరాబాదులోని లేక్ వ్యూ అతిథి గృహంలో నిర్వహించిన భేటీకి లోకేశ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా టీ టీడీపీ నానాటికీ బలహీనపడుతున్న వైనంపై జరిగిన చర్చలో లోకేశ్ కీలక ప్రకటన చేశారు. ఇకపై వారంలో ప్రతి శనివారం టీ టీడీపీ నేతలతో సమావేశమవుతానని ఆయన పార్టీ నేతలకు హామీ ఇచ్చారు. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటానని కూడా లోకేశ్ చెప్పారు.