: మంత్రికి అవమానం పట్ల అఖిలేశ్ నిరసన.. హార్వర్డ్ ప్రసంగం రద్దు
మంత్రి అజామ్ ఖాన్ కు అమెరికా విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ హార్వర్డ్ యూనివర్శిటీలో ప్రసంగాన్ని రద్దు చేసుకున్నారు. బోస్టన్ విమానాశ్రయంలో మంత్రి పట్ల భద్రత అధికారులు అమర్యాదకరంగా ప్రవర్తించడంతో నిరసనగా అఖిలేశ్ తాజా నిర్ణయం తీసుకున్నారు. అంతేగాకుండా తన గౌరవార్థం భారత దౌత్యకార్యాలయం ఇస్తున్న విందు కార్యక్రమాన్ని కూడా ఆయన బహిష్కరించారు. ప్రస్తుతం అఖిలేశ్ అమెరికాలోనే ఉన్నారు.
ఇటీవలే ఉత్తరప్రదేశ్ లో ముగిసిన కుంభ మేళా విజయవంతం అవగా, ఆ భారీ కార్యక్రమ నిర్వహణపై ప్రసంగించాల్సిందిగా అఖిలేశ్ ను హార్వర్డ్ యూనివర్శిటీ ఆహ్వానించింది. ఆయనతో పాటు అమెరికా చేరుకున్న యూపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అజామ్ ఖాన్ ను బోస్టన్ యూనివర్శిటీలో ఓ మహిళా అధికారి ప్రత్యేకంగా పది నిమిషాల పాటు ప్రశ్నించిగానీ ఆయన్ను ముందుకుసాగేందుకు అనుమతించలేదు. ఈ ఘటనపై భారత్ వర్గాలు నిరసన తెలిపాయి. లోక్ సభలో సమాజ్ వాదీ సభ్యులు ఆందోళనకు దిగారు. అమెరికా క్షమాపణ చెప్పాల్సిందేనని పట్టుబట్టారు కూడా.