: సంపాదన కోసమే పార్టీలు మారుతున్నారు: వీహెచ్ ఆగ్రహం
అధికార టీఆర్ఎస్ పార్టీలో ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ లేవని, తమ పార్టీ నేతలు అటువంటి పార్టీలోకి వెళుతున్నారని కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు అన్నారు. ఈరోజు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తమ పార్టీ నుంచి పోటీ చేసి పదవులు అనుభవించి ఇప్పుడు టీఆర్ఎస్ లోకి వెళుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గుత్తా సుఖేందర్ రెడ్డి, వివేక్, వినోద్ కాంగ్రెస్‌కు ద్రోహం చేశారని ఆయన అన్నారు. ప్రజలే వారికి బుద్ధి చెబుతారని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ కండువాలు మార్చడాన్ని గతంలో రాజకీయ వ్యభిచారంగా అభివర్ణించి, నీతులు చెప్పిన గుత్తా సుఖేందర్ రెడ్డి నేడు పార్టీ మారడమేంటంటూ ఆయన విమర్శించారు. ధన సముపార్జనే లక్ష్యంగా నేతలు అధికార టీఆర్ఎస్ పార్టీలోకి మారుతున్నారని ఆయన అన్నారు.