: కిరాతకానికి పరాకాష్ఠ... బతికుండగానే వ్యక్తి కళ్లు పీకి, చర్మం వలిచేసిన తాలిబన్లు
నిజమే! తాలిబన్ ఉగ్రవాదులు ఇటీవల పాల్పడ్డ దుశ్చర్య కిరాతకానికి పరాకాష్టే. తాము అపహరించిన ఓ వ్యక్తికి బతికుండానే నరకం చూపారు ఆ దుర్మార్గులు. బతికున్న బందీ చర్మాన్ని కత్తులతో వలిచేసిన తాలిబన్ ఉగ్రవాదులు... ఐఎస్ ఉగ్రవాదుల కిరాతక నైజానికి తామేమీ తీసిపోమని నిరూపించుకున్నారు. డిసెంబర్ లో జరిగిన ఈ దారుణ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళితే... పాకిస్థాన్ లో పురుడుపోసుకున్న తాలిబన్ ఉగ్రవాదులు ఆ తర్వాత పొరుగునే ఉన్న ఆఫ్ఘనిస్థాన్ కూ విస్తరించారు. ఆఫ్ఘన్ లోని ఘోర్ ప్రావిన్స్ కు చెందిన ఫజల్ అహ్మద్ అనే యువకుడు కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అహ్మద్ బంధువర్గానికి చెందిన కొందరు ఓ తాలిబన్ కమాండర్ ను చంపేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ కారణంగా ఓ రోజు అహ్మద్ ను అతడి ఇంటికి బయటకు ఈడ్చుకొచ్చిన తాలిబన్ ఉగ్రవాదులు... అతడి కళ్లను పీకేశారు. దీంతో విపరీతమైన బాధతో అతడు పెడబొబ్బలు పెడుతుండగానే అతడి ఛాతీ భాగంలోని చర్మాన్ని ఉగ్రవాదులు వలిచేశారు. దీంతో బతికుండగానే అతడి గుండే బయటకు కనిపించింది. అంతటితో ఆగని ఉగ్రవాదులు అతడిని పది అంతస్తుల భవనంపై నుంచి కిందకు తోసేశారు. దీంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు.